A place where you need to follow for what happening in world cup

బీఆర్ఎస్ పదేళ్ల పాలన ఆర్మూర్ కు స్వర్ణయుగం: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

రెండేళ్లలోనే ఆర్మూర్ ను అంధకారమయం చేసిన కాంగ్రెస్, బీజేపీలు..

0 63

ఇదీ నేను సాధించిన పదేళ్ల ప్రగతి

–కేసీఆర్ దయతో వేల కోట్ల నిధులు తీసుకువచ్చా

–ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపా

-బీఆర్ఎస్ పదేళ్ల పాలన ఆర్మూర్ కు స్వర్ణయుగం

-రూ.3వేల కోట్లతో ఆర్మూర్ నియోజక వర్గాన్ని తీర్చిదిద్దా

–వంద పడకల ఆస్పత్రి, రెవెన్యూ డివిజన్ తో మారిన ఆర్మూర్ రూపురేఖలు

–రూ.20 కోట్లతో సిద్దులగుట్టకు ఘాట్ రోడ్డు నిర్మించా

–రూ.150 కోట్లతో పంచగూడ వంతెన నిర్మాణం పూర్తి చేయించా

–అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం

– ఆర్మూర్ పట్టణానికి కొత్త శోభ తెచ్చిన బైపాస్ రోడ్ల నిర్మాణం

–ఒక్క ఆర్మూర్ పట్టణంలోనే రూ. వంద కోట్లతో రోడ్లు నిర్మించా

–అంబేడ్కర్ చౌరస్తాను సుందరీకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చా

–నియోజక వర్గంలో రోడ్డు లేని ఊరుందా?.. జీవన్ రెడ్డి పేరు లేని స్కీముందా?

-ఎత్తిపోతల పథకాలన్నీ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చినవే

–పదేళ్ళలో అభివృద్ధి పథకాలతో గ్రామాల రూపు రేఖలే మారాయి

-బీఆర్ఎస్ పథకాలనూ తామే తెచ్చామని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం.

-కాంగ్రెస్ ఇచ్చిన, బీజేపీ తెచ్చిన ఒక్క పథకం పేరు చెప్పగలరా?

-పదేళ్లలో నేను సాధించిన వంద పథకాల పేర్లు చెప్పగలను

రెండేళ్లలోనే ఆర్మూర్ ను అంధకారమయం చేసిన కాంగ్రెస్, బీజేపీలు

-కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ అవినీతిలో టాప్, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అభివృద్ధిలో ఫ్లాఫ్

కాంగ్రెస్, బీజేపీల పుణ్యమా అని అభివృద్ధి మాయం, అంతా అవినీతిమయం

రెండేళ్లలోనే ఆమడ దూరం వెనక్కి పోయిన ఆర్మూర్ అభివృద్ధి

-ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్ కు శాపం

-అభివృద్ధి, సంక్షేమం గిట్టని అధికార కాంగ్రెస్

-ఆర్మూర్ అభివృద్ధికి ఆణాపైస తేలేని దద్దమ్మ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు

-బీజేపీకి ఓటు వేసి ప్రగతికి చేటు చేశామని ప్రజా వేదన

–పదేళ్ళ కేసీఆర్ ప్రభుత్వంలో సాదించిన ఆర్మూర్ అభివృద్ధిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్

–కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ కు పట్టిన అష్టదరిద్రమని మండిపాటు

–ఈ రెండు పార్టీల అవినీతి, అక్రమాలకు, తప్పుడు పనులకు జనతా గ్యారేజ్ లో రిపేర్ చేస్తానని వార్నింగ్

–కేసీఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేసేంతవరకూ ప్రజల మధ్యే ఉంటానని శపథం

–నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్

–జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు సవాల్ విసిరిన జీవన్ రెడ్డి

తెలంగాణ ఫోకస్ (ఆర్మూర్, డిసెంబర్)07:

పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్వర్ణయుగంగా విరాజిల్లిన ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ సర్కార్ దిక్కుమాలిన పాలనలో పురోగతి కోల్పోయి అధోగతిపాలైందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్ళ బీ ఆర్ఎస్ పాలనలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జీవన్ రెడ్డి ఆదివారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ఏం చేశారో కాంగ్రెస్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి లు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిర్వాకం వల్ల నియోజక వర్గంలో అభివృద్ధి, ప్రజాసంక్షేమం మాయం కాగా కాంగ్రెస్ అధికార దురంహకారం రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష సాధింపులు, వేధింపులకు పాల్పడుతూ నియోజకవర్గాన్ని అవినీతి మయం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.
రెండేళ్లలోనే ఆర్మూర్ అభివృద్ధి ఆమడ దూరం వెనక్కి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్ ది అవినీతి, బీజేపీది దుర్నీతి.
ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్ కు శాపంగా మారిండు. అభివృద్ధి, సంక్షేమం గిట్టని అధికార కాంగ్రెస్ నేతలు భూతాలుగా మారారు.
ఆర్మూర్ అభివృద్ధికి ఆణాపైస తేలేని దద్దమ్మలు కాంగ్రెస్, బీజేపీల నాయకులు.
బీజేపీకి వేసిన ఓటు ఆర్మూర్ ప్రగతికి చేటుగా పరిణమించిందని నియోజక వర్గం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఇచ్చిన అధికారం జనం కళ్ళలో కారం కొట్టింది’ అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ఆర్మూర్ కు స్వర్ణయుగమన్నారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో దాదాపు రూ.3వేల కోట్ల నిధులు సాధించి ఆర్మూర్ నియోజక వర్గాన్ని తీర్చిదిద్దిన చరిత్ర తనదన్నారు. ‘ఆర్మూర్ నియోజక వర్గంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చినవే. బీఆర్ఎస్ హయాం లో మంజూరైన పథకాలనూ తామే తెచ్చామని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన, బీజేపీ తెచ్చిన ఒక్క పథకం పేరు చెప్పగలరా?.
పదేళ్లలో నేను సాధించిన వంద పథకాల పేర్లు గుక్కతిప్పుకోకుండా చెప్పగలను. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సీడీలే రూ.320కోట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 62 వేల మందికి రూ.2016, రూ.4016 చొప్పున ఆసరా పెన్షన్లు అందజేశా. 62 వేల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం ఇప్పించా .అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ చౌరస్తాలను సుందరీకరించాం.
12వందల మందికి దళితబంధు స్కీమ్ ద్వారా ద్వారా రూ. 10 లక్షల చొప్పున వచ్చి వారికిష్టమైన యూనిట్లు పెట్టుకొని ఆత్మ గౌరవ పతాకను ఎగురేశారు .
అప్పటి కేసీఆర్ సర్కారుకు సకల కులాలూ సమానమే.
ఆర్మూర్ లో వివిధ కులాలకు 17 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేశాం. 50వేల టిప్పర్ల మారం తోలించి సిద్ధులగుట్ట కు రూ. 20కోట్లతో ఘాటు రోడ్డు వేయించా. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశా. సిద్ధులగుట్టను దేశంలోనే అధ్బుతమైన శివాలయంగా, పర్యాటక స్థలంగా తీర్చి దిద్దా.
రూ. 120 కోట్లతో పంచగూడ వంతెన కట్టించి నిజామాబాద్-నిర్మల్ జిల్లాల మధ్య 93 కిలో మీటర్ల దూరం తగ్గించా. నియోజకవర్గమంతా రూ. 500 కోట్లతో రోడ్లు వేయించా. ఒక్క ఆర్మూర్ పట్టణంలోనే వంద కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు నిర్మించా. పట్టణంలో రోడ్డు లేని గల్లీ లేదు. పట్టణంలో డివైడర్లు నిర్మించి పదేళ్ళ పాటు పెంచిన చెట్లను కాంగ్రెస్ ఇంచార్జి పీ. వినయ్ కుమార్ రెడ్డి తన బొమ్మ కనపడాలని ప్రచార యావతో నరికించడం దారుణం అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాగా ఆర్మూర్- నిజామాబాద్, నిజామాబాద్- మాక్లూర్ కు రోడ్లు నిర్మించానాని, ఆర్టీసీ, ఆలూరు, వెల్మల్, నందిపేట్ సహా
తొమ్మిదికి పైగా బైపాస్ రోడ్లు వేయించానాని, ఆయన చెప్పారు. ఆర్మూర్ కు వంద పడకల ఆసుపత్రి సాధించా. దీని ఆధునీకరణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి రూ. 23కోట్లు మంజూరు చేయించానని ఆయన అన్నారు. ఈ దవాఖానలో రోజుకు 450 ఉచిత ప్రసవాలు జరిగి దేశంలోనే రికార్డు నెలకొల్పిందని, ఇప్పటికే 25 వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి కేసీఆర్ కిట్లు అందించామని జీవన్ రెడ్డి వివరించారు.. ఉచిత ప్రసవాల వల్ల ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున ఖర్చు తప్పిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్మూర్ వంద పడకల ఆస్పత్రి ఆలనా పాలనా లేక అనాథగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం తాను పలువురు బీ ఆర్ఎస్ నేతలతో కలిసి ఈ దవాఖాన సందర్శించి పరిస్థితిని పరిశీలించగా 44 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని, 120మంది నర్సులకు గాను కేవలం ముగ్గురు నర్సులు మాత్రమే ఉన్నారని, నెల మొత్తంలో 22 డెలివరీలు కూడా జరగలేదని, కేసీఆర్ కిట్లు నిలుపుదల చేశారని, ఆసుపత్రిలో అవసరమైన మందులు కూడా లేవని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి లోని డయాలసిస్ సెంటర్ కూడా సరిగ్గా పని చేయక కిడ్నీ సంబంధిత రోగులు అవస్థలు పడుతున్నారన్నారు. కాగా నియోజకవర్గం వ్యాప్తంగా అనారోగ్యంతో బాధపడుతున్న 25వేల మందికి పైగా సీఎం ఆర్ ఎఫ్ నిధులు మంజూరు చేయించా. మరో అయిదు వేల మందికి ఎల్ వోసీ చెక్కులు ఇప్పించి వారి ప్రాణాలు కాపాడా. నా దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే ప్రయివేటు ఆసుపత్రులలో డిస్కౌంట్ ఇప్పించా అని ఆయన గుర్తు చేశారు. ఆర్మూర్ ను రెవెన్యూ డివిజన్ గా మార్పించా.
కొత్తగా డొంకేశ్వర్, ఆలూరులను మండలాలను సాధించా. గొల్ల, కురుమ సోదరులకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయించా. ఏ కారణం చేతనైన రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు రైతుబీమా వచ్చింది. 450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం నియోజకవర్గంలోని 81 గ్రామాలకు, 36 వార్డులకు ఇంటింటికీ మిషన్ భగీరధ మంచి నీళ్లు సరఫరా చేసినం. ఒకప్పుడు కేవలం మంచినీళ్ల కోసం రాజారామ్ నగర్ లో హత్య జరిగినటువంటి దారుణ పరిస్థితులు ఇప్పుడు లేవు. గురుకుల పాఠశాలల్లో ఏడాదికి ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్షా 25వేల రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ ఇంగ్లీషు మీడియంలో విద్య నేర్పిస్తున్నాం. రూ. 120కోట్లతో పత్తేపూర్-చేపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సాధించా. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా ఒక లక్షా 116 రూపాయల చొప్పున ఇస్తూ 15వేల నుంచి 20వేల మంది పేదింటి ఆడ పిల్లల పెండ్లిండ్లు జరిపించాం. కానీ ఈ పథకం కింద నగదుతో పాటు తులం బంగారం చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటతప్పి వధువులను మోసం చేసిందని జీవన్ రెడ్డి వెల్లడించారు. గుండ్ల చెరువు ట్యాంక్ బండ్ ను అభివృద్ధి చేశా. నాయీ బ్రాహ్మణ, రజక సోదరులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. పదేళ్లలో నేను తెచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెబితే రామాయణమంత. వింటే మహాభారతమంత’ అని ఆయన పేర్కొన్నారు.
రెండేళ్లలోనే ఆర్మూర్ ను అంధకారమయం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గానికి శాపమని, కనీసం ప్రభుత్వ చెప్రాసి కూడా కాని అధికార కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం గిట్టని దరిద్రమని ఆయన దుయ్యబట్టారు. ఆర్మూర్ అభివృద్ధికి ఆణాపైస తేలేని దద్దమ్మ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్ళ కేసీఆర్ ప్రభుత్వంలో సాదించిన ఆర్మూర్ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానని, అలాగే కాంగ్రెస్, బీజేపీ లు ఏ ఒక్క పథకాన్ని సాధించారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ కు పట్టిన అష్టదరిద్రమని ఆ రెండు పార్టీల నాయకులు ఒప్పుకొని ప్రజల ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ రెండు పార్టీల అవినీతి, అక్రమాలకు, తప్పుడు పనులకు తన నివాసంలో ఏర్పాటు చేసిన జనతా గ్యారేజ్ లో రిపేర్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
కేసీఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేసేంతవరకూ ప్రజల మధ్యే ఉంటానని ఆయన శపథం చేశారు.
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు జీవన్ రెడ్డి సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరెంధర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, రాజేశ్వర్ రెడ్డి,మీర శ్రావణ్,పృథ్వి,గణేష్,అజీమ్,అభిలాష్,లతీఫ్,రహమత్,సత్తర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!