A place where you need to follow for what happening in world cup

అధికార లాంఛనాలతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు..

-శ్రద్ధాంజలి ఘటించిన మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం, ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, కలెక్టర్, సీ.పీ               

0 64

అధికార లాంఛనాలతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు..

శ్రద్ధాంజలి ఘటించిన మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం, ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, కలెక్టర్, సీ.పీ     

తెలంగాణ ఫోకస్ న్యూస్: ఆర్మూర్ ఫిబ్రవరి 01: విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య(24) అంత్యక్రియలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన సౌమ్య పార్థివదేహం ఆదివారం సాయంత్రం 4.00 గంటల సమయానికి ఆమె స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రానికి చేరుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఖురేషి, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సౌమ్య మృత దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా కల్పించారు. విధి నిర్వహణలో సౌమ్య కనబర్చిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమని శ్లాఘించారు. ఎంతో భవిష్యత్తు కలిగిన సౌమ్య చిన్న వయసులో అసువులు బాసిందని, ఈ సంఘటన యావత్ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వీర మరణం పొందిన సౌమ్య బలిదానం వృధా కానివ్వమని, ఆమె మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్ గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా ఆమె కుటుంబానికి పూర్తి జీతభత్యాలతో కూడిన పెన్షన్ అందిస్తామన్నారు. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని, ఎక్సైజ్ సిబ్బందికి కూడా ఆయుధాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న వారిపై భవిష్యత్తులో ఎవరు కూడా ఈ తరహా దాడులు చేసేందుకు భయపడేలా అవసరమైతే మరింత కఠిన చట్టాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. యువతను నిర్వీర్యం చేసే గంజాయి వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను రాష్ట్ర పొలిమేరల వరకు తరిమికొట్టేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం ఆవేదన కలిగించిందని అన్నారు.
కాగా, పోలీసు లాంఛనాలతో సౌమ్యకు తుది వీడ్కోలు పలుకగా, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు సౌమ్య అమర్ హై అని దారి పొడుగునా నినాదాలు చేస్తూ విషణ్ణవదనాలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సౌమ్య మృతితో మోస్రా గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!