చలి ప్రభావాన్ని లెక్క చేయకుండా ఓటర్లు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు
ఆర్మూర్ డివిజన్ పరిధిలో ప్రశాంతంగా ప్రారంభమైన తుది విడత పోలింగ్.. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) డిసెంబర్ 17: నిజామాబాద్ జిల్లాలో మూడవ (తుది) విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. చలి ప్రభావాన్ని లెక్క చేయకుండా ఓటర్లు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బాల్కొండ, అంకాపూర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం భీంగల్, బడా భీంగల్, రామన్నపేట్, మోర్తాడ్, కమ్మర్పల్లి తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ జెడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.