A place where you need to follow for what happening in world cup

77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ప్రసంగం.

జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

0 66

77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా
జిల్లా కలెక్టర్ గారి ప్రసంగం.        తెలంగాణ ఫోకస్ -పొన్నాల:                   
77వ గణతంత్ర దినోత్సవ సందర్భముగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థినీ, విద్యార్థులకు నా ఆశీస్సులు.
దేశ రాజ్యాంగాన్ని రూపొoదించుటకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అద్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి, సవరణలు చేసి అతి పెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.
భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన “భారత జాతీయ కాంగ్రెస్” 1930 లో “పూర్ణ రాజ్యం” కోసం ప్రకటన చేసి జనవరి 26 తేదీకి ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తేదీ నుండి భారత రాజ్యాంగం అమలు లోకి తీసుకరావలెనని నిశ్చయించనైనది. ఆ నాటి నుండి అనగా జనవరి 26, 1950 నుంచి బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయి మన రాజ్యాంగము అమలులోకి వచ్చింది. ఈ సందర్బాన్ని పురస్కరించుక్కొని మన జిల్లాలో వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని మీకు తెలియపరుస్తున్నాను.
1. వ్యవసాయం: 2025-26 యాసంగి సీజనులో 5.33 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్దం చేయడం జరిగింది. ప్రధానంగా వరి 4.31 లక్షల ఎకరాలు, శెనగ 14 వేల ఎకరాలు, మొక్క జొన్న 25 వేల ఎకరాలు, ఎర్ర జొన్న 24 వేల ఎకరాలు సాగు అవుతుందని అంచనాలు సిద్దం చేయడం జరిగింది. ఇప్పటి వరకు వరి 3.36 లక్షల ఎకరాలలో, శెనగ 14 వేల ఎకరాలలో, మొక్క జొన్న 32 వేల ఎకరాలలో, ఎర్ర జొన్న 21 వేల ఎకరాలలో అనగా మొత్తం 4.10 లక్షల ఎకరాలలో వివిధ పంటలు రైతులు సాగు చేయడం జరిగింది.
ఎరువులు: జిల్లాలో యాసంగి 2025-26 గాను యూరియా 82,055 డి.ఎ.పి. 21,187, పోటాష్ 12,743 మరియు కాంప్లెక్స్ ఎరువులు 46,851 మెట్రిక్ టన్నుల అవసరమైతాయని అంచనా వేయడం జరిగింది.
ఇందుకు గాను యూరియా 56,379, డి.ఎ.పి 17,173, పోటాష్ 644, కాంప్లెక్స్ ఎరువులు 29,454 మొత్తం కలిపి 1,03,650 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది.
అత్యవసరమైన పరిస్ధితులను ఎదుర్కొనుటకై 4,795 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ లో ఉంచడం జరిగింది.
పంట రుణ మాఫీ: రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4 విడతలలో మొత్తం 1,00,612 మంది రైతుల పంట రుణాలు 782.31 కోట్ల రూపాయలు రుణ మాఫీ చేయడం జరిగింది.
రైతు భీమా: జిల్లాలో 2025 -26 సంవత్సరమునకు గాను ఇప్పటి వరకు రైతు భీమాకు అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 308 రైతులకు సంబంధించిన వారి వారి నామిని బ్యాంకు ఖాతాలలో 15.40 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది.
రైతు భరోసా: ఈ పథకంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములను ఎకరాకు సీజనకు 6 వేల రూపాయల చొప్పున సంవత్సరానికి 12 వేల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ పథకంలో భాగంగా మన జిల్లాలో 2,72,589 మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో 316.63 కోట్ల రూపాయలు జమచేయడం జరిగినది.
2. పౌర సరఫరాల శాఖ: జిల్లాలో మొత్తం 4,41,023 ఆహార భద్రత కార్డుల ద్వారా 15,63,113 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. ప్రస్తుత జనవరి 2026 నెలలో 9024.451 మె.ట.ల ఉచిత బియ్యాని కేటాయించగా అందులో 8573.227 మె.ట.ల బియ్యాని పంపిణీ చేయడం జరిగింది.
మహా లక్ష్మి పథకం: ఈ పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అర్హులైన రేషన్ కార్డుదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో ‘మహాలక్ష్మి’ పథకం క్రింద 2,46,891 గ్యాస్ వినియోగదారులకు, 10,19,994 సిలిండర్లకు సబ్సిడీ విడుదల చేసి మొత్తం 30.73 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది.
కనీస మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు: 2025-26 వానాకాలం సీజన్ లో మొత్తం 669 కేంద్రాల ద్వారా 6,93,286 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 1,14,890 రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి 1,656 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలులో మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
3. ఇందిరమ్మ ఇండ్ల పథకం: మన రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి అనగా ఇంటి స్థలం కలిగి ఉన్న వారికి, ఇల్లు లేని వారికి, అద్దె ఇళ్ళల్లో నివాసం ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొనుటకు ఆర్థిక సహాయం చేయడానికి ఈ పథకము ప్రారంభించడం జరిగింది.
ఇందులో భాగముగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించి, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయముగా అందజేస్తూ, రాష్ట్ర వ్యాప్తముగా మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇట్టి ఆర్థిక సహాయము లబ్దిదారులకు నాలుగు విడతలలో చెల్లించడం జరుగుతుంది. బేస్మెంట్ పూర్తి కాగానే ఒక లక్ష, రూఫ్ లెవెల్ పూర్తి కాగానే మరో లక్ష, స్లాబ్ పూర్తి కాగానే రెండు లక్షలు మరియు ఇల్లు పూర్తి కాగానే మిగతా ఒక లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మన జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 16,919 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి. అందులో మార్కింగ్ పూర్తి అయిన ఇండ్లు 12,850 బేస్మెంట్ పూర్తి అయిన ఇండ్లు 9,865 రూఫ్ లెవెల్ వరకు పూర్తి అయిన ఇండ్లు 6,651 స్లాబ్ లెవెల్ వరకు పూర్తి అయిన ఇండ్లు 4,981 మరియు 216 ఇండ్లు పూర్తి అయినవి అందుకు గాను 266.94 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
4. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ:
మహలక్ష్మి పథకం: జిల్లాలో 09.12.2023 నుండి 19.01.2026 వరకు 7.82 కోట్ల మంది మహిళా ప్రయాణీకులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 329 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయినది. సగటున ప్రతిరోజు 1.02 లక్షల మంది మహిళా ప్రయాణీకులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు, మరియు తేది 24-12-2024 రోజు నుండి ఎలక్ట్రికల్ ఎక్స్ ప్రెస్ బస్సులు ప్రారంభించబడినవి. వీటిలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడినది.
5. విద్యుత్ శాఖ: జిల్లాలోని అన్ని క్యాటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది.
గృహ జ్యోతి: గృహజ్యోతి పథకం నందు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకూ 2,89,727 కుటుంబాలకు ప్రతి నెల జీరో బిల్లులు జారీ చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం 219.96 కోట్ల రూపాయల సబ్సిడీని అందజేసింది. అలాగే నాయిబ్రాహ్మణ మరియు రజక వృత్తులలో ఉన్న 3,023 మంది లబ్దిదారులకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుంది. టిజి-ఐపాస్ పథకం క్రింద ఏప్రిల్-2025 నుండి డిసెంబర్-2025 వరకు క్రొత్తగా 41 ఇండస్ట్రీలను కలుపుకొని మొత్తంగా 715 ఇండస్ట్రీలకు విద్యుత్ సరఫరా ఇవ్వబడినది. సి.యం. గిరివికాస్ పథకం క్రింద డిసెంబర్-2025 వరకు 78 మంది లబ్దిదారులకు వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ సౌకర్యo కల్పించడo జరిగినది.
6. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ:
చేయూత పెన్షన్: జిల్లాలో ఇప్పటివరకు 2,66,360 మంది వివిధ రకాల పెన్షన్ దారులకు ప్రతి నెల 57.36 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుంది.
స్త్రీ నిధి: 2025-26 సంవత్సరములో 5,678 సంఘాలకు 182 కోట్ల రూపాయలు స్త్రీ నిధి బ్యాంకు ద్వారా ఋణాలు మంజూరు చేయడం జరిగింది.
బ్యాంకు లింకేజీ: 2025-26 సంవత్సరములో 19,969 సంఘాలకు 1228 కోట్ల రూపాయల లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 12,700 సంఘాలకు గాను 1,109 కోట్ల రూపాయల ఋణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా అందించటము జరిగింది.
వడ్డీ రాయితీ: 2024-25 వ సంవత్సరములో ఏఫ్రిల్, 2024 నుండి జనవరి, 2025 నెల వరకు 40,199 సంఘాలకు 44.95 కోట్ల రూపాయలు విడుదల చేయటం జరిగినది.
7. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ: 2025-26 ఆర్థిక సంవత్సరములో 1,699 సంఘాలకు 200.90 కోట్ల రూపాయల లక్ష్యము కాగా బ్యాంక్ లింకేజ్ చేయటము జరిగినది. పట్టణ స్వయం ఉపాధి పథకము ద్వారా 58 యూనిట్లకు 35.27 లక్షల రూపాయల ఋణాలు మంజూరు చేయబడినవి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము:
2025-26 వ ఆర్థిక సంవత్సరములో ఇప్పటివరకు 85,034 కుటుంబాలలోని 1,17,886 కూలీలకు 16.08 లక్షల పని దినాలు కల్పించి 40.52 కోట్ల రూపాయలు కూలీల ఖాతాలలో జమ చేయడం జరిగింది. సరాసరి వేతనము రోజుకు 251 రూపాయల 93 పైసలు చెల్లింఛి ప్రతి కుటుంబానికి 22 రోజుల పని కల్పించబడినది. కూలీలకు 40.52 కోట్ల రూపాయలు మెటీరీయల్ కాంపొనెంట్ క్రింద 21.13 కోట్ల రూపాయలు మొత్తము కలిపి 61.65 కోట్ల రూపాయలు వారి వారి ఖాతాలలో జమ చేయడమైనది.
8. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ: 2025-26 ఆర్థిక సంవత్సరంకు గాను, జిల్లాకు 3,000 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటల సాగు చేయుట మరియు బిందు సేద్యం ఏర్పాటు చేయుటకు లక్ష్యాన్ని నిర్ణయించనైనది. ఇందులోభాగంగా, నేటివరకు 1,466 ఎకరాలకు సంబదించి ఎంపిక చేయబడిన 584 రైతులపేర పరిపాలన ఆమోదము పొందనైనది. కాగా నేటి వరకు 536 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలను రైతు తోటలలో నాటడం జరిగినది మరియు దీనికి గాను 450 ఎకరాలలో బిందు సేద్య పరికరాలను కూడా అమర్చడం జరిగినది. మిగిలిన 95 ఎకరాలలో సర్వేపనులు పురోగతిలో కలవు.
9. మత్స్య శాఖ: ప్రస్తుతం జిల్లాలోని మొత్తం 400 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 24,090 మంది సభ్యులు కలరు. 2025-26 సంవత్సరమునకు గాను 967 చెరువులలో మొత్తం 3 కోట్ల 85 లక్షల చేప పిల్లలను వదలడము జరిగింది. దానికి గాను 3.89 కోట్ల రూపాయలు వెచ్చించడము జరిగింది.
2025-26 సంవత్సరమునకు గాను సామూహిక ప్రమాద భీమ పథకము క్రింద NFDB కి సమర్పించబడిన ప్రతిపాదాన 11 కాగా వాటిలో 9 కి గాను వారి నామీనిలకు 45 లక్షల రూపాయలు పంపిణి చేయడం జరిగింది.
10. పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ: పశు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా, పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండ జిల్లాలో 1,83,611 పశువులకు ఉచితంగా టీకాలు వేయడం జరిగింది. గొర్రెలు మరియు మేకలకు వ్యాధి సోకకుండా 5,85,965 గొర్రెలు మరియు మేకలకు ఉచితంగా టీకాలు వేయడం జరిగింది.
11. పంచాయతీ రాజ్: జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలలో 2,721 మంది మల్టీపర్పస్ వర్కర్ల ద్వారా పారిశుద్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి. పారిశుధ్య నిర్వహణలో భాగంగా తడి మరియు పొడి చెత్తను వేరు వేరుగా సేకరిస్తూ డంపింగ్ యార్డు లకు తరలించి, తడి చెత్తను సేంద్రియ ఎరువుగా ఉత్పత్తి చేసి దానిని గ్రామాలలో నాటిన మొక్కలకు ఎరువుగా వినియోగించడం జరుగుతున్నది.
545 గ్రామ పంచాతీల యందు నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టడం జరిగుతున్నది. అదేవిధముగా గ్రామ పంచాయతీలలో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజు నీరు అందించుచు మొక్కలను సంరక్షించడం జరుగుతున్నది.
రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగముగా, తెలంగాణ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లా యందలి 545 గ్రామ పంచాతీల యందు ఎన్నికలు నిర్వహించనైనది. నూతనముగా ఎన్నిక కాబడిన సర్పంచులకు తేది: 19.01.2026 నుండి 28.02.2026 వరకు (5) బ్యాచ్ లలో నిష్ణాతులైన ToTs లచే శిక్షణ తరగతులు నిర్వహించబడుచున్నవి.
12. విద్యా శాఖ: జిల్లాలో 1,158 పాఠశాలల్లో 96,374 విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించబడుతుంది.
అమ్మ ఆదర్శ పాఠశాలలు: రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల, పాఠశాలల్లో మౌలిఖ వనరుల అభివృద్ది కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేబట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల కార్యాక్రమంలో మొదటి విడతలో భాగంగా 674 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతీ పాఠశాలలో 4 రకాల పనులను DMF ద్వారా చేపట్టి ఇప్పటి వరకు 24.01 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగినది.
13. వైద్య మరియు ఆరోగ్యశాఖ: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను విజయ వంతముగా నిర్వహిస్తూ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర మరియు జాతీయ స్థాయీలో ఉత్తమంగా ఆరోగ్య సేవలు అందించడం జరుగుచున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలు 7,358(48%) ఉన్న వాటిని ప్రస్తుతం 70% పైగా పెంచడానికి కృషి చేయడం జరుగుచున్నది. వ్యాధి నిరోధక టీకాలు పూర్తి స్థాయిలో 22,289 (90%) మందికి అందించడం జరిగింది. ప్రతి మంగళవారం మహిళల కోసం 8 రకాల ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేయబడును. అలాగే ప్రతి గురువారము 60 సంవత్సరాల పై బడిన వయో వృద్ధులకు ఈ సంవత్సరము ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు PHC లలో 27,384 అయుష్మాన్ ఆరోగ్య మందిర్ లలో 56,481 మంది రోగులకు పరీక్షలు చేసి చికిత్స అందించడం జరిగింది. వయో వృద్ధులకు ఫిజియోతెరేపి, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది.
RBSK కార్యక్రమం: జిల్లాలో పాఠశాల మరియు అంగన్వాడీలలో ఉన్న మొత్తం విద్యార్థుల 2,92,909 మందిని పరీక్షించి 12,241 విద్యార్థులకు గాను 12,190 విద్యార్థులకు మొబైల్ హెల్త్ టీం ద్వారా చికిత్స చేయడం జరిగింది.
14. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం: తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యము అందిచాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలందరికి మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని కేంద్ర – ఆరోగ్య పథకమైన ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి ఆరోగ్య యోజనతో కలిసి – రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తుంది. కుటుంబానికి ఉన్న5 లక్షల వైద్య సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 10 లక్షల వరకు పెంచడమైనది. ఈ పథకం క్రింద గుర్తించిన 1,835 రకాల వ్యాధులకు గుర్తింపు పొందిన ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారా చికిత్సలు మరియు శస్త్ర చికిత్సల సేవలను అందిస్తున్నది.
మన జిల్లాలో గడచిన ఏడాది కాలంలో 24,791 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించగా ఇందుకు గాను 66.12 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
15. మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ: జిల్లాలో 5 సమగ్ర శిశు అభివృద్ధి సేవ ప్రాజెక్టులలో 1,501 మేయిన్ అంగన్వాడి కేంద్రములు కలవు. అందులో 73,186 మంది పిల్లలకు, 10,232 గర్భిణీలు మరియు 8,483 బాలింతలకు అనుబంధ పోషకాహారము, 3-6 సంవత్సరము పిల్లలకు ఆట పాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందించ బడుచున్నది. జిల్లాలో ఆరోగ్యలక్ష్మి పథకం, పోషణ అభియాన్ పథకము ద్వారా వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు, సలహాలు సంప్రదింపులు, పోషణ మరియు ఆరోగ్య, విద్య మొదలగు సేవలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించబడుచున్నవి.
జిల్లాలో మొత్తం 1,501 అంగన్వాడీ కేంద్రాలలో ప్రస్తుతం 1,426 అంగన్వాడీ టీచర్లు, 933 అంగన్వాడీ ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. 76 అంగన్వాడీ టీచర్లు, 601 అంగన్వాడీ ఆయాలు ఖాళీలు కలవు.
జిల్లాలో 503 స్వంత అంగన్వాడీ భవనాలు, 609 అద్దె అంగన్వాడీ భవనాలు, 389 అద్దె ఉచిత అంగన్వాడీ కేంద్రాలు కలవు. స్వంత భవనాలు ఉన్న 494 అంగన్వాడి కేంద్రాలలో న్యూట్రీ గార్డన్ ఏర్పాటు చేసి మరియు స్వచ్చదనం పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.
16. షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ: 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలోని 32 ప్రీ మెట్రిక్ 10 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి మొత్తం 3,528 మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి గృహములలో నివాసం కల్పించనైనది. 2025-26 సంవత్సరములో బెస్టు అవలబుల్ స్కూల్స్ స్కీమ్ క్రింద 06 పాఠశాలలో కొత్తగా అడ్మిషన్ తీసుకున్న (203) విద్యార్థులకు మరియు రెనివల్ చేయబడిన (1,036) విద్యార్థులకు 318.10 లక్షల రూపాయలు ఖర్చు చేయడము జరిగినది. 2024-25 సంవత్సరములో కులాంతర వివాహములు చేసుకున్న 63 జంటలకు 158.96 లక్షల రూపాయల ఆర్థిక ప్రోత్సాహకము మంజూరు చేయడము జరిగినది.
పోస్ట్ మెట్రిక్ మరియు ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్స్: 2025-26 సంవత్సరములో 2,970 మంది విద్యార్థినీ, విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనములు, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజులకు గాను 248.27 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
శిక్షణలో ఉన్న యస్.సి. న్యాయవాదులకు ఆర్థిక సహాయము:
2025-26 సంవత్సరమునకు గాను ఈ పథకము క్రింద (05) న్యాయవాదులను ఎంపిక చేసి 1.50 లక్షల రూపాయలు ఖర్చు చేయనైనది.
17. జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ: జిల్లాలో మొత్తము షెడ్యూల్డు తెగల జనాభా 1,56,425 కలదు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 10 విద్యా సంస్థలు మరియు వసతి గృహాలు నిర్వహించబడుచున్నవి. 2025-26 సంవత్సరములో వసతి గృహ విద్యార్థుల నిర్వహణ కొరకు 106.81 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది. దీనివలన 1,416 మంది వసతి గృహ మరియు కళాశాల విద్యార్థినీ విద్యార్థులు లబ్దిపొందినారు.
పోస్ట్ మెట్రిక్ మరియు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనములు: 2025-26 సంవత్సరములో 356.94 లక్ష రూపాయల నిధులు విడుదల కాగా 2022-23 మరియు 2023-24 సంవత్సరములోని పెండింగ్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనములు 355.54 లక్షల రూపాయలు ఖర్చు చేయడమైనది. దీని వలన (2,242) విద్యార్థినీ/విద్యార్థులు లబ్ది పొందినారు.
2025-26 సంవత్సరములో బెస్ట్ అవైలేబుల్ స్కూల్ స్కీమ్ వలన మొత్తము 205 మంది విద్యార్థినీ మరియు విద్యార్థులు లబ్ది పొందుతున్నారు.
18. వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ: 2025-26 సంవత్సరములో జిల్లాలోని వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభ్యాసము కొరకు బాలురకు మరియు బాలికలకు వేర్వేరుగా ప్రిమెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ కు చెందినా 3,235 విద్యార్థుల కొరకు 34 వసతి గృహములు నడుపబడుచున్నవి. ఇందుకు గాను 11.18 కోట్ల రూపాయలు విడుదల చేయగా 10.70 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ప్రవేశము: 2025-26 ఆర్థిక సంవత్సరములో ప్రతిభ కనబరిచిన 28 మంది బి.సి 03 ఇ.బి.సి విద్యార్థులకు ఒక్కొక్కరికి 35 వేల రూపాయల చొప్పున ఉపకార వేతనము మంజూరు చేస్తూ వారికి కార్పొరేట్ కళాశాలలో ప్రవేశము కల్పించబడినది.
బి.సి స్డడీ సర్కీల్ ద్వారా ఉద్యోగార్థులకు శిక్షణా తరగతులు: 2025-26 ఆర్థిక సంవత్సరములో 100 మంది అభ్యర్థులకు గ్రూప్ I, II, III, IV, SSC, RRB మరియు Banking రంగాలలో ఉద్యోగాల కొరకు సెప్టెంబర్ 1వ తేది నుండి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించబడినవి.
19. అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్రిస్టమస్ పండుగ వేడుకలలో భాగంగా విందు నిర్వహణ నిమిత్తము జిల్లాలో మొత్తం (05) అసెంబ్లీ నియోజకవర్గములకు గాను ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గమునకు 2 లక్ష రూపాయల చొప్పున మొత్తం 10 లక్ష రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే జిల్లాలోని ఒక్కొక్క చర్చీకి రంగులు వేయడానికి 30 వేలు, వైట్ వాష్ కొరకు 20 వేలు అలాగే లైటింగ్ కొరకు 10 వేల రూపాయల చొప్పున ఒక్కొక్క నియోజకవర్గానికి (50) చర్చీల లెక్కన మొత్తం 250 చర్చీలకు 75 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వము 2025 సంవత్సరానికి గాను జిల్లాలోని (05) నియోజకవర్గాలలో రంజాన్ ప౦డుగ వేడుకలు జరుపుకోవడానికి గాను 29 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది.
20. రహదారులు మరియు భవనముల శాఖ:
ఆర్.ఓ.బి. నిర్మాణము:- మాధవనగర్ ఎల్.సి నం.193 మరియు అర్సపల్లి ఎల్.సి నం 191 పనులు 230 కోట్ల రూపాయలతో మంజూరు కాగా అట్టి పనులు అభివృద్ధి దశలో కలవు.
ప్రణాళికేతర పనులు 2024-25: 30 కోట్ల రూపాయలతో (08) పనులు మంజూరు కాగా, (01) పని పూర్తీ అయినది, మిగితా పనులు అభివృద్ధి దశలో కలవు.
ప్రణాళికేతర పనులు 2025-26: 28.45 కోట్లరూపాయలతో (09) పనులు మంజూరు కాగా, పనులు అభివృద్ధి దశలో కలవు.
21. జిల్లా పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ: జిల్లాలో వివిధ రకాల పథకాల క్రింద 8,912 అభివృద్ధి పనులను 560.88 కోట్ల రూపాయలతో మంజూరు చేయగా, 6097 పనులకు 453.97 కోట్ల రూపాయల వెచ్చించి పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన పనులు పురోగతిలో కలవు.
22. నీటి పారుదల శాఖ: 8.38 కోట్ల రూపాయలతో చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల నిర్వహణకు పరిపాలన ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి.
చెక్ డ్యామ్‌లు: జిల్లాలో (10) చెక్ డ్యాములు పురోగతిలో కలవు ఇప్పటి వరకు 32.32 కోట్ల రూపాయల ఖర్చు చేయడం జరిగింది.
IDC పథకాలు: జిల్లాలో 64,649 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి 37 ఐడీసీ పథకాలు ఉన్నాయి. ఫతేపూర్, సుబ్రియాల్ & చిట్టాపూర్ సంయుక్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం 9,214 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి ప్రభుత్వం 149.66 కోట్ల రూపాయల పరిపాలనా ఆమోదం తెలిపింది సంబంధిత పనులు పురోగతిలో ఉన్నాయి.
23. కళ్యాణ లక్ష్మి/ షాది ముభారాక్:
పేదవారికి ఆడపిల్ల పెళ్ళి భారం కాకూడదని ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి – షాదిముబారక్. ఈ పథకం క్రింద పెళ్లి అయిన ఆడ పిల్లకు 1,00,116 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది.
జిల్లాలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరములో 3,529 మంది లబ్ధిదారులకు 35 కోట్ల 33 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా షాదీ ముబారక్ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరములో 2,223 మంది లబ్ధిదారులకు సుమారు 22 కోట్ల 25 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది.
24. భూ భారతి:
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక సంస్కరణల్లో ఒకటిగా భూ భారతి చట్టం – 2025 నిలిచింది. ఇది జనవరి 4, 2025 న గెజిట్‌లో ప్రచురించబడి ఏప్రిల్ 14, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేయబడింది. జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో రైతులకు తేది:17-04-2025 నుండి 30-04-2025 వరకు అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీనివల్ల భూ సంబంధిత సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కరించే వీలును కల్పించింది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో తేది:03-06-2025 నుండి 20-06-2025 వరకు జరిగిన రెవెన్యూ సదస్సుల్లో 40,462 దరఖాస్తులు అందగా, అందులో 17,762 పరిష్కరించదగ్గవిగా గుర్తించబడ్డాయి, వాటిలో విచారణ అనంతరం 3,418 ఆమోదించబడగా మిగిలిన 14,344 విచారణ దశలో ఉన్నాయి.
25. పరిశ్రమల శాఖ: జిల్లాలో 8 భారీ మరియు మధ్య తరహా పరిశ్రమలు 368.45 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడినవి. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడినది. జిల్లాలో 900 సూక్ష్మ మరియు చిన్నతరహా పరిశ్రమలు, 516.60 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి, 6,983 మందికి ఉపాధి కల్పించ బడినది.
26. శాంతి భద్రతలు:
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళటానికి కృషి చేస్తుంది. జిల్లాలో మహిళల రక్షణకు షి టీంలు సమర్దవంతంగా పనిచేస్తున్నాయి.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వార్షిక ఉద్యోగ క్యాలండర్ ద్వారా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టనైనది.
ప్రజలు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ, బాధ్యతలను విస్మరించకుండా దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలి అని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషిచేస్తున్న పోలీసు యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ద కార్మికులకు, పత్రిక విలేఖరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుటకు మీ అందరి సహకారాన్ని కోరుచూ, మరొకసారి జిల్లా ప్రజలందరికి 77 వ గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!