ఆర్టీసీ బస్టాండ్ వద్ద మురికికాలువ కంపు. – మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.
తెలంగాణ ఫోకస్ -మీ పొన్నాల ఫిబ్రవరి23: ఆర్మూర్ బస్టాండ్ పరిసర ప్రాంతంలో ఉన్న మురికికాలువ శుభ్రత లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ నిండిపోయి మురికి నీరు బయటకు పొంగిపొర్లడం వల్ల రోడ్డు మార్గం అంతా దుర్వాసనతో నిండిపోయింది. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, పక్కనే ఉన్న దుకాణదారులు ఈ దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నారు.
రోజూ వందలాది మంది ప్రయాణికులు ఈ మార్గంలో నడవాల్సి రావడం వల్ల ప్రమాదాల ముప్పు పెరిగింది. చిన్న పిల్లలు, వృద్ధులు జారి పడే అవకాశాలు ఉన్నాయి. మురికినీటిలో దోమలు పెరిగి, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపించే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు పలుమార్లు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. తాత్కాలికంగా నీరు తీసివేసినా, కొద్ది రోజుల్లోనే పరిస్థితి మళ్లీ యథావిధిగా మారుతోంది. వర్షాకాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో తక్షణమే కాలువల శుభ్రత పనులు చేపట్టి, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.