A place where you need to follow for what happening in world cup

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పర్యటన: పెండింగ్ దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారానికి ఆదేశం.

0 33

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పర్యటన: పెండింగ్ దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారానికి ఆదేశం.

~ కామారెడ్డి, నిజామాబాద్ అధికారులతో సమీక్షించిన ఎం.చంద్రశేఖర్ గౌడ్.                    ~ పన్ను ఎగవేతదారులు, అధిక లోడ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం.

~ కార్యాలయాల్లో దళారీల వ్యవస్థకు తావులేకుండా పారదర్శక సేవలు అందించాలి..

ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్ -పొన్నాల) నవంబర్ 11:

రవాణా శాఖలో ప్రజలకు అందుతున్న సేవలను మరింత వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (ఐటీ, విజిలెన్స్, రోడ్ సేఫ్టీ) ఎం.చంద్రశేఖర్ గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి, వేర్వేరు విభాగాల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల రవాణా శాఖ అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కౌంటర్ల వారీగా జరుగుతున్న లావాదేవీలను, లెర్నర్ లైసెన్స్ (ఎల్ ఎల్ ర్), డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్), వాహనాల ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్ రెన్యువల్ విభాగాల పురోగతిని ఆయన ఆరా తీశారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ప్రధానాంశాలు & ఆదేశాలు: పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం:

వాహన్, సారథి, సీఎఫ్‌ఎస్‌టీ పోర్టళ్లలో నిలిచిపోయిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్మార్ట్ కార్డుల ప్రింటింగ్, డిస్పాచ్ ప్రక్రియలను వేగవంతం చేసి వాహనదారులకు సకాలంలో చేరేలా చూడాలన్నారు.

రెవెన్యూ వసూళ్లు & ప్రత్యేక డ్రైవ్‌లు:

ఇన్స్‌పెక్టర్ల వారీగా ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను సమీక్షించారు. పన్ను బకాయిలు ఉన్న వాహనాలపై, అలాగే రహదారులపై పరిమితికి మించి అధిక లోడుతో వెళ్లే వాహనాలపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మధ్యవర్తుల ప్రవేశం నిషిద్ధం:

 రవాణా కార్యాలయాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు, మధ్యవర్తులు (దళారీలు) రాకుండా పూర్తిగా నిరోధించాలని స్పష్టం చేశారు. విధుల్లో పారదర్శకత, క్రమశిక్షణ, జవాబుదారీతనం పాటించాలని హెచ్చరించారు.

 మొక్కలు నాటిన అధికారులు:

పర్యటనలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉప రవాణా కమిషనర్ శ్రీమతి జి. దుర్గ ప్రమీల, జిల్లా రవాణా అధికారి (డిటిఓ) శ్రీ రమేష్ రాథోడ్,ఆర్‌టీఓ శ్రీ టి.సంతోష్ కుమార్, కామారెడ్డి ఆర్‌టీఓ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ ప్రహ్లాద్, మోటార్ వాహన తనిఖీ అధికారులు (ఏంవిఐ’ఎస్) అశ్వంత్ కుమార్, రాహుల్, ప్రదీప్, అసిస్టెంట్ మోటార్ వాహన తనిఖీ అధికారి (ఏఏంవిఐ) రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!