భార్య చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి ప్లాట్ అమ్మేసిన భర్త అరెస్ట్.
~ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన మోసం.
~ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు..
~ ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి.
ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్ -పొన్నాల) నవంబర్ 14: భార్య బతికే ఉన్నప్పటికీ, ఆమె చనిపోయినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కోట్లాది విలువైన స్థలాన్ని అక్రమంగా విక్రయించిన ఘటన ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి:
ఆర్మూర్ పెర్కిట్ ప్రాంతానికి చెందిన దేశాయిపేట రవికి 2017లో గీతాంజలితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (మోక్షిత్) కలడు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో గీతాంజలి తన కుమారుడితో కలిసి వేరుగా తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది.
అయితే ఆర్మూర్ నగరంలోని కోటర్మూర్ ప్రాంతంలో సర్వే నంబర్ 212/అ, 212/ఆ, లేఅవుట్ ప్లాట్ నంబర్ 4 లో భార్య గీతాంజలి పేరు మీద ఉన్న సుమారు 267 గజాల స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని రవి పథకం పన్నాడు. తాను ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తుండటంతో, ఆ అనుభసంతో తన ఆఫీసు కంప్యూటర్లోనే భార్య గీతాంజలి చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు.
అంతటితో ఆగకుండా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో భార్య చనిపోయినట్టు మరణ వాంగ్మూల ధ్రువీకరణ పత్రాలు, తద్వారా అప్పటి ఎమ్మార్వో కార్యాలయం నుండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందాడు. ఇద్దరిని సాక్షులుగా పెట్టి, భార్య పేరు మీద ఉన్న ఆ ప్లాటును 2025లో తన తల్లి లక్ష్మీబాయి పేరిట ఆర్మూర్ సబ్-రిజిస్టర్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్ చేయించాడు. ఆ తర్వాత ఆ స్థలాన్ని మరొకరికి రూ. 15 లక్షలకు సేల్ డీడ్ రూపంలో అమ్మేశాడు. అంతేకాకుండా, ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ పొందే ఉద్దేశంతోనూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది.
ఈ మోసానికి పాల్పడిన నిందితుడు దేశాయిపేట రవి (తండ్రి పేరు: శంకర్ప్ప, వయసు: 45 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్, నివాసం: పెర్కిట్, ఆర్మూర్) ను శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో సబ్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్, కానిస్టేబుల్స్ రాములు, సతీష్ పోలీస్ సిబ్బంది సమక్షంలో మీడియాకు ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు