పట్టా ఉన్నా పరాయివాళ్లమేనా?.. సర్వే నంబర్ 401 రైతుల ఆవేదన!
ప్రజావాణిలో ఫిర్యాదులకే పరిమితం...కదలని యంత్రాంగం.
పట్టా ఉన్నా పరాయివాళ్లమేనా?.. సర్వే నంబర్ 401 రైతుల ఆవేదన!
~ నిషేధిత జాబితా (22-A)లో ఆర్మూర్ యానంగుట్ట శివారు భూములు..
~ అమ్ముకోలేక, అత్యవసరాలకు వాడుకోలేక కర్షకుల విలవిల..
~ ప్రజావాణిలో ఫిర్యాదులకే పరిమితం…కదలని యంత్రాంగం.
~ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా స్పందనపైనే ఆశలు..
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ టీవీ) నవంబర్ 16: తరతరాలుగా సాగు చేసుకుంటున్న సొంత భూమి కళ్లముందే కనిపిస్తున్నా, దానిపై పూర్తి హక్కులు లేక ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్ట శివారు రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఈ శివారు పరిధిలోని సర్వే నంబర్ 401 భూములు ప్రభుత్వ నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్)లో చిక్కుకుపోవడంతో ఏళ్ల తరబడి క్రయవిక్రయాలకు నోచుకోవడం లేదు. ఫలితంగా తమ భూములను అమ్ముకోలేక, అవసరమైతే కొనుగోలు చేయలేక అన్నదాతలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ బాధిత రైతులు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అత్యవసరాలకు అక్కరకు రాని ఆస్తి:
సాధారణంగా రైతుకు భూమి ఒక ఆస్తి మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే భరోసా. కానీ సర్వే నంబర్ 401 బాధిత రైతుల పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. కుటుంబంలో పెళ్లిళ్లు, పిల్లల ఉన్నత చదువులు, అనారోగ్య సమస్యలు వంటి అత్యవసర ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు సొంత భూమిని అమ్ముకుందామన్నా వీలుకాని దుస్థితి నెలకొంది. కనీసం వారసులకు భూ బదలాయింపు (మ్యుటేషన్) చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు.. ఫలితం శూన్యం:
తమ గోడును వినిపించేందుకు రైతులు తొక్కని గడప లేదు, కలవని అధికారి లేరు. గతంలో పలుమార్లు సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమంలో మూడుసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రెవెన్యూ యంత్రాంగంలో కదలిక రాకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితాలపై ఉన్న సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ తమ సమస్యను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
విచారణ జరిపి న్యాయం చేయాలి:
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. సర్వే నంబర్ 401కి సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, తమకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని వేడుకుంటున్నారు. సబ్ కలెక్టర్ స్పందించి తమ ఏళ్ల నాటి కష్టాలకు తెరదించుతారని యానంగుట్ట రైతులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.