A place where you need to follow for what happening in world cup

అభివృద్ధి ఓడింది,అరాచకం గెలిచింది -బీఆర్ఎస్ నేత,మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

0 62

అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది.

– అడుగడుగునా అధికార దుర్వినియోగం

– ఎక్కడ చూసినా డబ్బు,మద్యం, బెదిరింపుల రాజకీయలు

– వీటన్నింటినీ తట్టుకుని పోరాడిన బీఆర్ఎస్

– పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ న్యూస్) ఫిబ్రవరి13:
అడుగడుగునా అధికారదుర్విని యోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులను తట్టుకుని బీఆర్ఎస్ పోరాడిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యల వల్ల అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది అని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను నిలవరించలేకపోయారని ఆయన అన్నారు. కాంగ్రెస్ సాధించిన దొడ్డిదారి విజయం అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని ఆయన అభివర్ణించారు. ఎక్కడ చూసినా డబ్బు, మద్యం , బెదిరింపులతో కాంగ్రెస్ విలువలను మంటగల్పిందని, పోలీసులు పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల మాదిరిగా వ్యవహరించి ఆకృత్యాలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు.
వీటన్నింటినీ తట్టుకుని పోరాడిన బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ లకు వణుకు పుట్టించిందన్నారు.
అరాచకాలు, అక్రమాలకు భయపడకుండా మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 720కి పైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. పల్లెలు, పట్టణం తేడా లేకుండా రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించిందని జీవన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలు గాలిలో కలిపి, సంక్షేమ పథకాలను అటకెక్కించిన పాపం ఊరికే పోదన్నారు. అందుకే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన చెప్పారు.కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని మొన్న పంచాయితీ ఫలితాలు, నేడు మున్సిపల్ ఫలితాలు కుండబద్దలు కొట్టినట్టు రుజువు చేశాయని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!