అనుమతులు లేవు.. ఆశ చూపి కోట్లు నొక్కేశారు.. -మీడియాకు వివరాలు వెల్లడించిన ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి
అనుమతులు లేవు.. ఆశ చూపి కోట్లు నొక్కేశారు!
‘షైన్ అబ్రాడ్’ కన్సల్టెన్సీ ముసుగులో విదేశీ ఉద్యోగాల మోసం.. వ్యక్తి అరెస్ట్.
మీడియాకు వివరాలు వెల్లడించిన ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ టీవీ) అక్టోబర్ 30: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజల వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని ఆర్మూర్ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి పోలీసు సిబ్బంది అరెస్టు చేసినట్లు మీడియాకు శుక్రవారం వెల్లడించారు.
ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరాలు ఇలా వెల్లడించారు..
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ‘షైన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ’ పేరుతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మూర్‌కు చెందిన షేక్ తాహ అలియాస్ షేక్ సైఫ్ (26, తండ్రి: సలీం) అనే వ్యక్తి ఈ కన్సల్టెన్సీని నిర్వహిస్తూ విదేశాలకు పాస్‌పోర్ట్‌లు, వీసాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు.
గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, నందిపేట్, వేల్పూర్, జక్రాన్‌పల్లి, ముప్‌కాల్ సరిహద్దు మండలాలతో పాటు కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన అనేకమందిని ఇతడు లక్ష్యంగా చేసుకున్నాడు. ఇజ్రాయిల్, రష్యా వంటి దేశాల్లో వర్క్ వీసాలు ఇప్పిస్తానని చెప్పి, ఒక్కొక్కరి వద్ద నుంచి ₹3 లక్షల నుంచి ₹10 లక్షల వరకు వసూలు చేశాడు.
డబ్బులు తీసుకున్న తర్వాత కొందరికి వర్క్ వీసాలకు బదులు విజిట్ వీసాలు ఇచ్చి చేతులు దులుపుకోగా, మరికొందరికి అసలు వీసాలే ఇవ్వకుండా వారి పాస్‌పోర్ట్‌లను తన వద్దే పెట్టుకొని తిప్పుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు షేక్ సైఫ్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.
బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి:ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి
‘షైన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ’ చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో గానీ, తమ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లలో గానీ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. బాధితులకు చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. నిందితుడు ఇప్పటివరకు ఎంతమందిని మోసం చేశాడనే కోణంలో పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ తో పాటు కానిస్టేబుల్స్ పోలీస్ సిబ్బంది ఉన్నారు