
ఆర్మూర్ లో ఘనంగా పోలీస్ అమరవీరుల కొవ్వొత్తుల ర్యాలీ
~ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ టీవీ)అక్టోబర్ 31:విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఆర్మూర్ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ శనివారం రాత్రి నిర్వహించారు.
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో దాదాపు 70 నుండి 80 మంది పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి పూర్తి భరోసా కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అమరవీరుల ఆత్మశాంతిని కోరుతూ ఘనంగా నివాళులు అర్పించారు. ర్యాలీ విజయవంతం కావడానికి సహకరించిన పట్టణ ప్రజాప్రతినిధులకు, యువతకు, ప్రజలకు ఆర్మూర్ పట్టణ పోలీస్ తరుపున పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.